రూ.7 వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ అరెస్ట్… బోధన్ టూ టౌన్‌లో ఏసీబీ దాడి
తొలి సమయం డెస్క్/బోధన్, మే 6:
నిజామాబాద్ జిల్లా బోధన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చిటన్నోజు భాస్కరాచారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తన సోదరుడి కొడుకు పేరును ఒక క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో, వారి సూచనల మేరకు వలపన్ని, లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్ఐని పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా లంచాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.