*మరిపెడలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీలు*
*ఎస్ ఐ ఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పరిశీలన*
*సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యా, వసతి సౌకర్యాలపై ఆరా*
తొలి సమయం
మహబూబాబాద్/, మరిపెడ: జూలై 25
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ స్నేహ శబరిష్ మరిపెడ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించి ఎస్ ఐ ఆర్ సవరణ డిజిటలైజేషన్ కార్యక్రమంతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, వసతి గృహం (నరసింహులపేట)లను తనిఖీ చేశారు. కార్యక్రమాల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ముందుగా మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ ఐ ఆర్ సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు, ఇంకా బీఎల్ఓలకు తిరిగి అందని ఫారాల పరిస్థితిపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి వెళ్లి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఆగస్టు 3లోగా అన్ని ఫారాలను పూర్తి చేసి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ మరిపెడ మండల పరిధిలోని నరసింహులపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. తరగతి గదులు, వసతి గృహం, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భోజన నాణ్యత, డైట్ మెనూ అమలు, వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు.
ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించేలా బోధన ఉండాలని, ముఖ్యంగా ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల్లో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం అంశాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని చెప్పారు. విద్యార్థినులు, భోజనం తయారు చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాలికల ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉపాధ్యాయులు, వార్డెన్లకు సూచించారు.
పాఠశాల లేదా వసతి గృహ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.