ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: సీఐ సర్వయ్య
తొలి సమయం మహబూబాబాద్ మర్చి 4:
కురవి పోలీసు స్టేషన్లో నిర్వహించిన కురవి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్ల సమావేశంలో సీఐ సర్వయ్య ప్రధానంగా ప్రసంగించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, నేరాల నియంత్రణలో వాటి పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
“ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని సీఐ సర్వయ్య పేర్కొన్నారు. ఏదైనా నేరం జరిగి సీసీ కెమెరాలో నమోదైతే, ఆ దృశ్యాలు న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదని వెల్లడించారు.
గ్రామాల్లో భద్రతా వాతావరణాన్ని మెరుగుపరచాలంటే ప్రతి సర్పంచ్ తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఐ సర్వయ్య సూచించారు. ప్రజల సహకారంతో గ్రామాలను మరింత సురక్షిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో Si గండ్రాతి సతీష్, Si జయకుమార్ పాల్గొన్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు భద్రతా చర్యల్లో భాగస్వాములమవుతామని హామీ ఇచ్చారు.