జ్యోతిష్కుడి మాటలకు బలైన యువతి… బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినీ ఆత్మహత్య
తొలి సమయం మహబూబాబాద్ మర్చి
1
బెంగళూరు (Karnataka): జ్యోతిష్కుడి మాటలను నమ్మి తీవ్ర భయాందోళనలకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో కలకలం రేపింది. తొమ్మిది రోజుల క్రితమే వివాహం జరిగిన 29 ఏళ్ల విద్యాజ్యోతి తన జీవితాన్ని తానే ముగించుకోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను విషాదంలో ముంచింది.
పోలీసుల వివరాల ప్రకారం… బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కొడగు ప్రాంతానికి చెందిన తన ప్రియుడిని ఇటీవలే వివాహం చేసుకుంది. వివాహానంతరం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంట్లోనే ఉన్న ఆమెను ఓ జ్యోతిష్కుడు సంప్రదించినట్లు సమాచారం.
“నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు… త్వరలోనే నూకలు చెల్లుతాయి” అంటూ జ్యోతిష్కుడు భయపెట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, “తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలి. చివరి రోజు తాళిని తీసి అమ్మవారికి సమర్పిస్తే మంచిది జరుగుతుంది” అని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ మాటలకు తీవ్రంగా భయపడిన విద్యాజ్యోతి సూచించిన విధంగా పూజలు నిర్వహించింది. తొమ్మిదో రోజు అమ్మవారికి తాళి సమర్పించే ముందు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జ్యోతిష్కుడి పాత్రపై విచారణ జరుగుతోందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన మరోసారి మూఢనమ్మకాల ప్రమాదాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
*గమనిక:* మానసిక ఆందోళనలు, భయాలు కలిగితే వెంటనే కుటుంబసభ్యులు లేదా నిపుణులను సంప్రదించడం అవసరం. మూఢనమ్మకాలపై ఆధారపడకుండా సరైన సలహా తీసుకోవడం ప్రాణాలను కాపాడగలదు.