*హత్య కేసులో నేరస్తునికి జీవిత ఖైదు*
తొలి సమయం, బయ్యారం.
జనవరి, 08.
బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో నమోదైన హత్య కేసులో నేరస్తునికి గౌరవనీయ న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే, తేదీ 15-02-2021 నాడు జంజిరాల వెంకటమ్మ ఫిర్యాదు మేరకు ఆమె కుమార్తె కొండబత్తుల సరిత (వయస్సు 20 సంవత్సరాలు) ను ఆమె భర్త కొండబత్తుల నరేష్ మద్యం మత్తులో అనుమానంతో నిత్యం వేధిస్తూ, శారీరకంగా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా బాధితురాలిపై దాడులు చేసిన కారణంగా ఆమెను పిల్లలతో కలిసి మాతృగృహానికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అనంతరం తేదీ 14-02-2021 నాడు నేరస్తుడు జయ్యారం గ్రామానికి వచ్చి, 15-02-2021 ఉదయం సరితను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మబలికి, తన ద్విచక్ర వాహనంపై సరితను మరియు ఆమె చిన్న కుమార్తెను తీసుకొని బయలుదేరాడు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ శివారులోకి తీసుకెళ్లి, అక్కడ సరితను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై బయ్యారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ గారు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, అనంతరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సేకరించి, నేరస్తుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయడం జరిగింది.
ఈ కేసును విచారించిన గౌరవనీయ న్యాయస్థానం సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి, నేరం రుజువైన నేపథ్యంలో నేరస్తునికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి, నేరస్తునికి శిక్ష పడేలా చేసిన బయ్యారం పోలీస్ అధికారులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డా. శబరీష్ అభినందించారు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.