తొలి సమయం, ఇల్లందు : ప్రవేట్ పాఠశాలల అదనపు దోపిడి…అసలుకంటే అధికంగా ఉంటుందని విద్యార్ధుల తల్లి తండ్రులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. రెగ్యులర్ గా చదువు చెప్పడానికి తరగతిని బట్టి సంవత్సరానికి ఎంత వసూల్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువగా వివిధ రూపాల్లో విద్యార్ధుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని కొన్ని ప్రవేట్, స్కూళ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్ధుల తల్లి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉండడం, అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ప్రవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. టై బ్యాడ్జి, అదనపు క్లాస్లులు, సెంట్రల్ సిలబస్, వారు సూచించిన చోటే బుక్స్, బట్టలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు విద్యార్ధికి అవసరమైన ప్రతిదీ యాజమాన్యాల కనుసన్నల్లో వ్యాపారం జరుగుతుంది. ఇందులో ప్రవేట్ స్కూల్స్ వారికి కమిషన్లు నేరుగా అందుతాయి. ఇదంతా ఒకెత్తు ఐతే ఇటీవల ప్రవేట్ పాఠశాలలు యానివల్ సెలబిరేషన్ పేరుతో విద్యార్ధుల వద్దనుండి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ ఒక్కో విద్యార్ధి నుండి1500 వసూలు చేసి ఒకలడ్డు, కొంచెం భూంది ప్యాక్ చేసి అందచేశారని ఆ పాఠశాల పేరెంట్స్ బహిరంగంగా విమర్శలు చేసారు. స్కూల్ యాజమాన్యాలు, వసూలు చేసే ఫీజుల నుండి యానివల్ సెలబిరేషన్ చేయాల్సి ఉండగా పిల్లల వద్ద వసూలు చేయడమేంటని బహిరంగంగానే చర్చించు కోవడం గమన్హారం. కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రవేట్ స్కూల్స్, వసూల్ చేసే అసలు, కొసరు వ్యవహారంపై అధికారులు కనీసం స్పందించక పోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
స్పందించడం మరిచిపోయిన విద్యార్ధి సంఘాలు.
విద్యార్ధులు ఎదుర్కుంటున్న సమస్యలపై స్పందించి పోరాటాలు చేసే విద్యార్ధి సంఘాలు నిరశించాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా లేవని, వసతులు లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ వసతి గృహాలలో సరైన వసతులు లేవని అధికారులపై, ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసే విద్యార్ధి సంఘాలకు ప్రవేట్ స్కూల్స్ దోపిడి కనపడక పోవడం విచారకరం. పోరాట పటిమ కోల్పోతున్న విద్యార్ధి సంఘాలు ఉనికి కోసం అప్పుడప్పుడు మేమున్నామని రోడ్లెక్కి ఆందోళన చేయడం వెనుక దాగివున్న వాస్తవాలు ఆత్మ విమర్శ చేసుకొని ఫీజుల తో పాటు,అదనంగా వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్స్ పై దృష్టి సారించి పోరాటాలు నిర్వహిస్తే కొద్ది మంది పిల్లలకైన న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రవేట్ పాఠశాలల యానివల్ సెలబిరేషన్ కోసం విద్యార్ధుల నుండి భారీగా వసూలు చేస్తున్న విద్యా సంస్థల పై అధికారులు విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని టి డి పి నియోజక కన్వీనర్ ముద్రగడ వంశీ డిమాండ్ చేసారు. యానివల్ సెలబిరేషన్ అనేది స్కూల్ ప్రతిష్ట పెంచుకోవడానికి యాజమాన్యాలు నిర్వహించే కార్యక్రమం దీనికి విద్యార్ధుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్స్ వారికి వచ్చే లాభాల నుండి ఖర్చు చేయాల్సి ఉండగా విద్యార్ధుల పై భారం మోపడం సరైంది కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.