
తొలిసమయం, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలారం సమీపంలోని మేడికుంట గుట్టలో పెద్ద పులి కనిపించడం స్థానికులలో కలకలం సృష్టించింది. చేపల వేటకు వెళ్లిన వినోద్ అనే యువకుడు ఈ పులిని ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనలో పరిగెత్తి బయటకు వెళ్లారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు మళ్లీ గుర్తు చేశారు. సమీపంలోని అడవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అటవీశాఖ అధికారులు పెద్ద పులికి చెందిన పాద అడుగులను గుర్తించడంతో ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ వజహత్ వెంటనే ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఒంటరిగా అడవులు, పొలాలు లేదా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెద్ద పులి ఆనవాళ్లు గానీ, పులి కనిపించినట్లు గానీ సమాచారం లభిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని రేంజ్ ఆఫీసర్ వజహత్ కోరారు. భయంతో లేదా అవగాహన లేకుండా పులికి హాని కలిగించే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టంగా హెచ్చరించారు. పరిస్థితిని అటవీశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజల భద్రతే లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.