స్థానిక పోరుకు మా పార్టీ అభ్యర్థులు సిద్ధం
లక్ష్యం కోసం లక్ష సైన్యం
తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్
తొలిసమయం, కొత్తగూడెం : బీసీ లను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పేందుకు బహుజనలతో పాటు ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు, సోదరులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు రాష్ట్రీయ లోక్ దళ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. బస్ స్టాండ్ నుంచి గణేష్ బస్తీ, ఆర్టీసీ బస్ డిపో, విశ్వరూప థియేటర్, ఫారెస్ట్ కాంప్లెక్స్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ఆయనకు స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం పీఆర్ పంక్షన్ హాల్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో చేరిన ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులకు కపిలవాయి దిలీప్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ పోటీ చేస్తుందని ప్రకటించారు. అదేవిధంగా, “లక్ష్యం కోసం లక్ష సైన్యం” అని ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తెలంగాణలో తక్షణమే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఒక లక్ష మంది యువతను నియమించి, రిటైర్డ్ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ ద్వారా క్రమశిక్షణ, నిజాయితీ, శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, సమాజంలో అవినీతిని నిర్మూలించడం, యువతకు ఉపాధి కల్పించడం, యువ సాధికారత, నైపుణ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో నైపుణ్య శిక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. “లక్ష్యం కోసం లక్ష సైన్యం” కార్యక్రమానికి నారగోని కమాండర్-ఇన్-చీఫ్ గా నియమించినట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారగోని, వెనుకబడిన తరగతులకు (బీసీలకు) చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా రైతుల సంక్షేమానికి సంబంధించిన హామీలను. పూర్తిస్థాయిలో అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఆరు నెలల్లోగా రైతులు మరియు వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరియు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసి జెఏసి తెలంగాణ చైర్మన్ నారగోని, బీసీ చైర్మన్ ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎల్డీ అధ్యక్షులు కట్టా సతీష్, యాదాద్రి భువనగరి ఆర్ఎల్డీ అధ్యక్షులు బీరప్ప, ఖమ్మం ఆర్ఎల్టి ఆధ్యకులు జానీ, మహబూబాబాద్ ఆర్ఎల్డీ అధ్యకులు డివై గిరి, టీఆర్ఎల్డీ ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్, నరసింహారావు, జి. వెంకటేశ్వర్లు, జి. వెంకటస్వామి, సుధాకర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.