కొడుకును మృత్యువు నుంచి తప్పించి తను అహుతి అయిన తల్లి
మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన
తొలి సమయం మార్కాపురం: ఆంధ్రప్రదేశ్:
మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45) తన కుమారుడు మనోహర్‌తో కలిసి ప్రమాదానికి గురైన బస్సులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గ్రహించిన రమాదేవి, తన కుమారుడిని వెంటనే బయటకు తోసేసి అతని ప్రాణాలను రక్షించారు.
అయితే కొడుకు బయటకు వచ్చిన కొద్దిసేపటికే మంటలు మరింత ఉద్ధృతంగా మారడంతో రమాదేవి బస్సులోనే చిక్కుకుపోయారు. కొడుకు కళ్లెదుటే ఆమె సజీవదహనమవడం అక్కడున్న వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లి ప్రేమ, త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన గ్రామస్థులను కన్నీళ్లు పెట్టించింది.
ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.