33 ఏళ్ల పాటు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరికి RTIతో బయటపడిన భారీ మోసం

33 ఏళ్ల పాటు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. చివరికి RTIతో బయటపడిన భారీ మోసం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలి సమయం, మహబూబాబాద్ మర్చి 14:

ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పత్రాల సాయంతో ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేసి, దశాబ్దాల పాటు జీతభత్యాలు పొందిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 33 ఏళ్ల పాటు రెండు శాఖల నుండి జీతం మరియు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ వచ్చిన ఈ మోసం చివరకు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా బయటపడింది. ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.30 వేల జరిమానా కూడా విధించింది.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2009 ఫిబ్రవరి 20న బారాబంకికి చెందిన ప్రభాత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను తయారు చేసి, మోసపూరితంగా రెండు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయప్రకాష్ సింగ్ 1993 జూన్‌లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. అయితే, ఉపాధ్యాయుడిగా నియమితుడు కావడానికి చాలా సంవత్సరాల ముందే 1979 డిసెంబర్ 26న ప్రతాప్‌గఢ్ జిల్లాలో ‘నాన్ మెడికల్ అసిస్టెంట్’గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు తేలింది.

అప్పటి నుండి రెండు శాఖల్లో ఒకేసారి విధులు నిర్వహిస్తున్నట్టు చూపిస్తూ దశాబ్దాల పాటు రెండు చోట్ల నుండి జీతభత్యాలు తీసుకుంటూ వచ్చాడు. ఈ విషయం చాలా సంవత్సరాల పాటు ఎవరికి తెలియకుండా కొనసాగింది. అయితే సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించడంతో ఈ భారీ మోసం బయటపడింది.

పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడు జయప్రకాష్ సింగ్‌ను దోషిగా తేల్చారు. అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *