అప్పుల భారంతో అమానుషానికి పాల్పడి ఇద్దరు కుమార్తెలను కడతేర్చిన తండ్రి…
మహిళా దినోత్సవం రోజే కామారెడ్డిలో హృదయ విదారక ఘటన*
తొలి సమయం మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ తండ్రి తన సొంత కుమార్తెల ప్రాణాలు తీసిన దారుణ సంఘటన వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లాకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య షబీనా కూలి పనులకు వెళ్లి కుటుంబానికి తోడ్పడుతోంది. అయితే ఇటీవల కుటుంబంపై సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు పెరగడంతో ఇస్మాయిల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.
ఈ నేపథ్యంలో అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక అమానుష నిర్ణయం తీసుకున్న ఇస్మాయిల్, తన ఇద్దరు చిన్నారి కుమార్తెలను చెరువులోకి తోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడినట్లు తెలిసింది.
అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టగా, విచారణలో ఇస్మాయిల్ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుల భారం తట్టుకోలేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపాడు.
ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజునే ఇద్దరు పసి బాలికలు ఇలా బలి కావడం విషాదాన్ని మరింత పెంచింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.