విజయవంతంగా ముగిసిన మానుకోట ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం..
తొలిసమయం, మహబూబాబాద్ జనవరి 18
మానుకోట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీ సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహించిన ఉచిత విలువిద్య (ఆర్చరీ) శిక్షణ శిబిరం విజయవంతంగా, ఘనంగా ముగిసింది. గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడం, క్రమశిక్షణ, ఏకాగ్రతను అలవర్చడం, సరైన మార్గనిర్దేశం అందించడం ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించబడింది.
శిబిరం ముగింపు కార్యక్రమానికి పట్టణ డీఎస్పీ శ్రీ ఎన్. తిరుపతి రావు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన యువ క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ ప్రాంత యువత కూడా క్రీడా రంగంలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. విలువిద్య అభివృద్ధికి తన వంతు సహకారంగా ఒక ఆర్చరీ బోర్డును స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు సాదుల సారంగపాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి, సామాజికంగా బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా ట్రస్ట్‌ను స్థాపించామని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తున్నామని వివరించారు.
ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్ – ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యులు పుట్ట శంకరయ్య ప్రత్యేక అతిథిగా పాల్గొని, విలువిద్యలో ఉన్న అవకాశాలు, భవిష్యత్తులో యువతకు లభించే క్రీడా అవకాశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాదుల సురేష్, రఘువీర్, ఉపేందర్, జయంత్, పట్టణ ప్రముఖులు శ్రీరంగం మురళీకృష్ణ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన యువత ప్రదర్శించిన విలువిద్య ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
గ్రామీణ క్రీడాభివృద్ధికి దోహదపడే ఈ శిబిరాన్ని స్థానికులు, తల్లిదండ్రులు విశేషంగా అభినందించారు. మానుకోట జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలంటే తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పిల్లలను ప్రోత్సహిస్తూ అవసరమైన క్రీడా సౌకర్యాలు, సామగ్రి అందించాల్సిన అవసరం ఉందని వక్తలు తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా క్రీడల అభివృద్ధికి వ్యవస్థాగత ఏర్పాట్ల కోసం కృషి చేయాలని కోరారు.
ఆర్చరీ క్రీడాభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని సాదుల సారంగపాణి మరియు పుట్ట శంకరయ్య తెలిపారు