కోనసీమ ఇరుసమండలో ఓఎన్జీసీ గ్యాస్ బావిలో అదుపులోకి రాని మంటలు
గ్రామం ఖాళీ, పరిస్థితిపై కలెక్టర్ పర్యవేక్షణ
కోనసీమ జిల్లా ఇరుసమండలో ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బావిలో చెలరేగిన మంటలు అదుపులోకి రావడం లేదు. బావిలో దాదాపు 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ ఉండటంతో మంటలు ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్ ప్రవాహం తగ్గే వరకు మంటలను పూర్తిగా అదుపు చేయడం కష్టమేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేసే చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు. గూడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేసారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఇరుసమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. పరిసర ప్రాంతాల్లో అప్రమత్తం ప్రకటించి, పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా పర్యవేక్షిస్తోంది.